MLC Kavithaకు బిగ్‌డే: ముగియనున్న కస్టడీ; ఈడీ ప్లాన్ అదే; తీహార్ జైలా.. బెయిలా!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కవిత అరెస్ట్ తర్వాత కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చిన కోర్టు, ఇంకా కవితను విచారించాలని కోర్టును కోరితే మరో మూడు రోజులు కస్టడీని పొడిగించింది. అయితే ఈ మూడు రోజుల కస్టడీ కూడా నేటితో ముగియనుంది. దీంతో మళ్ళీ కోర్టు ఎదుట కవితను హాజరు పరచవలసి ఉంది ఈడీ.
ఇదిలా ఉంటే తన అరెస్ట్ అక్రమమని, పదేపదే గొంతు చించుకుంటున్న కవిత వేదన మాత్రం అరణ్య రోదనగా మారింది. మొదట రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అరెస్ట్ అక్రమమని, తనపై ఈడీ కేసును రద్దు చెయ్యాలని సవాల్ చేసిన కవితకు చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ సక్రమమేనని, అన్ని చట్టాలు వారు సక్రమంగానే అనుసరించారని కవిత పిటీషన్ కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కూడా కవితకు చేదు అనుభవం ఎదురైంది.

సుప్రీం కోర్టు కూడా చట్టం ముందు అంతా సమానమేనని, రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేకంగా ఏమీ ఉండదని, విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మళ్ళీ కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసి మొన్న ఈడీ కస్టడీ ముగిసిన నాడే బెయిల్ పిటీషన్ పై కూడా విచారణ జరపాలని కోరగా కోర్టు తోసిపిచ్చింది.
నేడు కవిత బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఇక బెయిల్ పిటీషన్ పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చెయ్యాలని పేర్కొంది. దీంతో కవితకు బెయిల్ రాకుండా ఈడీ కోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకు రెడీ అవుతుంది. అంతేకాదు నేడు కవిత కస్టడీ పొడిగింపు ముగుస్తున్న కారణంగా కవితను మరో నాలుగురోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం.
కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమెను బెయిల్ పై విడుదల చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమే లేదని కవిత తరపు న్యాయవాది వాదించే అవకాశం ఉంది. అయితే ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి కారణాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది.
అయితే ఈ రోజు కవిత బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు ధర్మాసనం ముందు ఉంది. ఈడీ కోరినట్టు మళ్ళీ కవితను కస్టడీకి ఇస్తే ఈడీ ఆఫీసుకు, బెయిల్ రాకుంటే, ఈడీ కస్టడీకి ఇవ్వకుంటే ఆమెను రిమాండ్ కోసం తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు కవితకు బిగ్ డే అని చెప్పాలి.. బెయిల్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠకు కారణం అవుతుంది.












Click it and Unblock the Notifications