ఐప్యాక్ కు భారీ దెబ్బ
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది.
ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ, వ్యూహాల రూపకర్త ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (IPAC) కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆ సంస్థకు గల కార్యాలయాలపై మెరుపుదాడులు నిర్వహించారు. నేడు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ దాడులు ఏకకాలంగా జరిగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మనీ లాండరింగ్, హవాలా కార్యకలాపాలను నిర్వహిస్తోందనే కారణంతో దాడుల జరిగినట్లుగా చెబుతున్నారు. గతంలో కూడా ఐప్యాక్ కు సంబంధించిన కొన్ని కార్యాలయాల్లో తనిఖీలు సాగాయి. తాజా దాడులు వీటికి కొనసాగింపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఐప్యాక్.. పశ్చిమ బెంగాల్ లో విస్తృతంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తో సన్నిహితంగా పని చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు రూపొందిస్తోంది.
ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఐప్యాక్ పై ఈడీ తాజా దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. దర్యాప్తులో భాగంగా బెంగళూరులో ఐప్యాక్ డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ కు చెందిన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించినట్లు ఇండియాటుడే పేర్కొంది. గత జనవరిలో కోల్‌కతాలో ఐప్యాక్ కార్యాలయంలోనూ ఈ సోదాలు జరిగాయి.
గత దాడుల సమయంలో మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు ఐ-ప్యాక్ సాల్ట్ లేక్ కార్యాలయంలో సోదాలను అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తొలగించారని పేర్కొంది. వీటిని మమత బెనర్జీ తోసిపుచ్చారు. ఈడీ తన పరిధిని అతిక్రమించిందని విమర్శించారు. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి పనిచేసినందు వల్ల సుమారు 10 కోట్ల రూపాయలు హవాలా మార్గాల ద్వారా ఐప్యాక్ అందాయనేది ఈడీ ఆరోపణ.












Click it and Unblock the Notifications