హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు పొంచి ఉన్న అతి పెద్ద విపత్తు!
ప్రకృతి గమనంలో వస్తున్న ఆకస్మిక మార్పులు మానవాళికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తున్న అసాధారణ మార్పుల వల్ల ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినబోతోందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావం వల్ల ఒకే సమయంలో భూమిపై కొన్ని ప్రాంతాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటే, మరికొన్ని ప్రాంతాలు అకాల వర్షాలతో మునిగిపోనున్నాయి.
భారతదేశంలోని ప్రధాన నగరాలపై ఎల్ నినో ప్రభావం
ముఖ్యంగా భారతదేశంలోని ప్రధాన నగరాలపై ఈ ప్రభావం గట్టిగా ఉండబోతోందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ దేశాల వాతావరణాన్ని నిర్దేశించే పసిఫిక్ మహాసముద్ర ఉపరితలం ప్రస్తుతం విపరీతంగా వేడెక్కుతోంది. వాతావరణ శాస్త్ర పరిభాషలో దీనిని 'ఎన్సో ' ఉష్ణ దశ అంటారు. సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కడం వల్ల వర్షపు మేఘాలను మోసుకెళ్లే గాలుల దిశ మారిపోతుంది.

తగ్గనున్న సాధారణ వర్షపాతం
సాధారణంగా వాతావరణ సూచీ ప్రకారం ఈ ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ దాటితేనే ఆందోళనకరంగా భావిస్తారు. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం, జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో ఈ ఉష్ణోగ్రత ఏకంగా 1.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ మరియు అంతర్జాతీయ సంస్థల విశ్లేషణల ప్రకారం, ఈ ఏడాది దేశంలో రుతుపవనాల ద్వారా కురిసే సాధారణ వర్షపాతం గణనీయంగా తగ్గుతుంది.
రాబోయే మూడునెలలు ఈ నగరాల్లో వర్షాలు కరువు
కేవలం 90 శాతానికే పరిమితం కానుంది. దీనివల్ల దేశంలో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి జనసాంద్రత కలిగిన నగరాల్లో రాబోయే మూడు నెలలు వర్షాలు ముఖం చాటేయనున్నాయి. కేవలం ఈశాన్య భారత రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రతికూల ప్రభావం నుండి కొంతవరకు ఉపశమనం పొందగలవని అంచనా వేస్తున్నారు.
ఎల్ నినో అంటే వర్షాలు పూర్తిగా ఆగిపోవడం కాదు
కేవలం భారతదేశమే కాకుండా ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రెజిల్‌లోని కొన్ని నగరాలు కూడా తీవ్ర వర్షపాత లేమితో ఇబ్బంది పడనున్నాయి. ఎల్ నినో అంటే వర్షాలు పూర్తిగా ఆగిపోవడం కాదు, వర్షాలు కురిసే సంప్రదాయ ప్రాంతాలు మారిపోవడం. భూగోళంపై ఒకవైపు చుక్క నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే, సాధారణంగా పొడిగా ఉండే ఈక్వెడార్ తీర ప్రాంతాలు, అలాగే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వంటి నగరాలు శీతాకాలంలో ఊహించని రీతిలో రికార్డు స్థాయి కుండపోత వర్షాలతో జలమయం కానున్నాయి.
ప్రపంచ వ్యాప్త సంక్షోభం
ఈ సంక్షోభంపై అంతర్జాతీయ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కేవలం సముద్రాలకే పరిమితం కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆహార భద్రతను, తాగునీటి లభ్యతను దెబ్బతీస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అప్రమత్తమై ముందస్తు నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications