భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్
రామభక్తులకు ఎన్నికల సంఘం నుంచి శుభవార్త అందింది. భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాములోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్ 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
గత 40 ఏళ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని, ఈ నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలిపాయి. ఈ క్రమంలో స్పందించిన ఎన్నికల సంఘం.. తాజాగా, ఏప్రిల్ 17న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ముస్తాబైన భద్రాద్రి.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎస్
భద్రాద్రిలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. బుధవారం జరగనున్న శ్రీసీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. రేపు మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. ఇందు కోసం మిథిలా మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.
కాగా, భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంక్షలు పాటిస్తూ సీతారాముల చంద్ర స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
ఉచిత దర్శనం
శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రికి తరలిరానున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు ఆపివేసి భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామని భద్రాచలం ఆలయ ఈవీ రమాదేవి తెలిపారు.
దర్శనంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా కదిలి వచ్చే భక్తుల కోసం నిరంతరాయంగా అన్నదాన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులంతా అధిక సంఖ్యలో కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకుని, సీతారాముల కల్యాణ ఉచిత తలంబ్రాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ కోరారు.












Click it and Unblock the Notifications