ఎన్నికల సంఘం కీలక నిర్ణయం: ఆ నగదు, కానుకలు అభ్యర్థుల ఖాతాలోకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడిన నగదు, కానుకలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు, కానుకల విలువను పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఎన్నికల సంఘం (election commission) ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఖాతాకు జమ చేయాలని సూచించింది.
అక్రమ మద్యం, డ్రగ్స్ కట్టడికి ఆధునికంగా ఆలోచించాలని పేర్కొంది. మనుగోడు ఉపఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ, తనిఖీలు సహా ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసింది.

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ బుధవారం హైదరాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర అధికారులతో సమావేశమై ఏర్పాట్లు, సన్నద్ధత గురించి ఆరా తీశారు. అంశాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, వస్తున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు తదితర వివరాలపై ఆరా తీశారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలని, ఈసీ మార్గదర్శకాలను పూర్తిస్థాయిోల పాటించాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో విడిగా సమావేశమయ్యారు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు.
ఈ సందర్భంగా తనిఖీలు, స్వాధీనాల గురించి తెలుసుకున్నారు. నిఘా పటిష్టంగా ఉండాలని, తనిఖీలు మరింత ముమ్మరంగా జరగాలని, చెక్ పోస్టుల నిర్వహణ సమర్థంగా ఉండేలా చూడాలని సూచించారు. నోటిఫికేషన్ తో ఎన్నికల ప్రక్రియ జోరందుకున్న వేళ తనిఖీలు, స్వాధీనాలు పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో విడిగా సమావేశమైన ఎన్నికల సంఘం అధికారులు.. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం, శాంతిభద్రతల నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు.
ఇక త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో.. భారీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అసలు రాజీపడొద్దని తెలిపారు. నవంబరు 30వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించే ఏర్పాటు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications