అంగన్వాడీలు వెలిగిపోతున్నాయ్.. మంత్రి సీతక్క చొరవ!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కాదు, అంగన్వాడీ కేంద్రాలను సైతం బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికి అంగన్వాడి సెంటర్లకు సొంత భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతుల పైన కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా మంత్రి సీతక్క చొరవతో యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు.
విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్న అంగన్వాడీలు
కేవలం గత ఆరు నెలలలోనే 9,800అంగన్వాడి కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్వాడి కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దాదాపు 90% అంగన్వాడీ కేంద్రాలు ప్రస్తుతం విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయి. మిగిలిన అంగన్వాడి కేంద్రాలకు సైతం త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి, నూరుశాతం విద్యుద్దీకరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలను వేగవంతం చేసింది.

అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు
గతంలో దాదాపు 40 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యమే లేకపోవడంతో చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీకటి గదులు, ఉక్కపోత వాతావరణంలో చిన్నారులు కేంద్రాలకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. ఫ్యాన్లు, లైట్లు లేకపోవడంతో వేసవి కాలంలో పిల్లలను కేంద్రాల్లో ఉంచడం అంగన్‌వాడీ కార్యకర్తలకు సవాల్‌గా మారేది. డిజిటల్ బోధనకు సైతం విద్యుత్ లేమి ప్రధాన అడ్డంకిగా నిలిచింది.
అంగన్‌వాడీ కేంద్రాల విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి
ఈ పరిస్థితిని గుర్తించిన మంత్రి సీతక్క అంగన్‌వాడీ కేంద్రాల విద్యుదీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న విధానాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది.
గత ఆరు నెలల వ్యవధిలోనే 9,800 కేంద్రాలకు విద్యుత్ వెలుగులు
విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ కొత్త కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ కనెక్షన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఫలితంగా 11 వేల 194 కేంద్రాలకు నూతనంగా విద్యుత్ సదుపాయం కల్పించారు. అయితే గత ఆరు నెలల వ్యవధిలోనే 9,800 కేంద్రాలు విద్యుత్ వెలుగులను సంతరించుకున్నాయి.
అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణపై మంత్రి సీతక్క హర్షం
అంగన్‌వాడీ కేంద్రాల విద్యుదీకరణ పురోగతిపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. బలమైన భవిష్యత్‌కు బాల్యమే పునాది. చిన్నారులు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణంలో ఎదగాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత. త్వరలోనే మిగిలిన కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం లక్ష్యాన్ని సాధిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications