హైదరాబాద్‌లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ ఏర్పాటు: 500 మందికి ఉపాధి
వందేళ్ల చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రో సిస్టమ్స్ హైదరాబాద్ నగరంలో సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆ కంపెనీ సీఈవో వినీత్ బృందం.. రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసింది. పలు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు సెమీ కండక్టర్లను సరఫరా చేస్తున్నట్లు అలెగ్రో ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
పెట్టుబడిదారులకు సౌకర్యాలు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకువస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

కాగా, అలెగ్రో పరిశోధన అభివృద్ధి సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలెగ్రో మైక్రో సిస్టంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. దేశంలో ఎన్నో ప్రధాన నగరాలను కాదని హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న సిస్టమ్ స్కేల్ వర్కర్ల అవలబిలిటీ, గవర్నమెంట్ పాలసీస్.. ఇవన్నీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు.
దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో సెమీ కండక్టర్ల వినియోగం విరివిగా పెరుగుతుందన్నారు. ఆటోమేటివ్, ఇండస్ట్రీస్ రంగాల్లో సెమీ కండక్టర్ల వినియోగంపై గ్లోబల్ ఆర్ అండ్ డీ చేస్తారు. ఈ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ప్రోత్సాహం వల్లే అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications