హరీష్ రావు అరెస్ట్.. సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ధర్నా, ఉద్రిక్తత!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఎపిసోడ్ రాజకీయంగా రసవత్తరంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గాజులు, చీర పంపిస్తున్నానని చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ చిలికిచిలికి గాలివానైంది.
సైబరాబాద్ కమీషనరేట్ వద్ద ఉద్రిక్తత
నేడు అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల పర్వం అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి రచ్చ చేసేదాకా కొనసాగింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసిన క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా సైబరాబాద్ కమీషనరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన పాడి కౌశిక్ రెడ్డి
అయితే తన ఇంటి పైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పాడికౌశిక్ రెడ్డి సిపి ఆఫీస్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి తో పాటు సిపి ఆఫీసుకు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి తనపై దాడి చేసిన వారి పైన హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
హరీష్ రావు అరెస్ట్
అడ్డుకోబోయిన పోలీసులపైకి వేలెత్తి చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డిని సముదాయించి పక్కకు పంపించినప్పటికీ అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అయితే హరీష్ రావు అరికెపూడి గాంధీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేవరకు అక్కడే ఉంటామని, అరెస్టు చేయకుంటే మాత్రం కోర్టుకు వెళతామని హెచ్చరించారు. సిపి ఆఫీసు వద్ద ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు బీఆర్ఎస్ శ్రేణులు రాత్రి వరకు 10000 మంది తరలిరావాలని హరీష్ రావు పిలుపునివ్వడంతో సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పలుమార్లు బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు.
హరీష్ రావు తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతల అరెస్ట్
అయినప్పటికీ వారు అక్కడే బైఠాయించడంతో హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సబితా ఇంద్రా రెడ్డి , గంగుల కమలాకర్ , ప్రశాంత్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వారిని పోలీసు వాహనాలలో ఎక్కించి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications