'ఆమె' కేసీఆర్ వీరాభిమాని!!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గత ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత పార్టీలో ముఖ్య నాయకులుగా అనేక పదవులను అనుభవించిన వారు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బిజెపిల బాట పట్టారు. కెసిఆర్ పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడు ఎవరు గోడ దూకుతారు అన్నది తెలియని పరిస్థితి ఉంది . గత పదేళ్లలో కేసీఆర్ వల్ల పదవులను అనుభవించి కేసీఆర్ మాటకే కట్టుబడి పని చేసిన నాయకులు ప్రస్తుతం అధికారం పోగానే జంప్ జిలానీ అన్నారు.
కట్టె కాలే దాకా కేసీఆర్ తోనే
ప్రతిపక్షంలో ఉన్న కష్ట కాలంలోనూ కేసీఆర్ వెంట నడిచే నాయకులు ఎవరూ లేరు అనుకునే సమయంలో కట్టే కాలే దాకా కెసిఆర్ తోనే కలిసి సాగుతానని స్పష్టం చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కెసిఆర్ పైన విపరీతమైన అభిమానాన్ని చూపించే సత్యవతి రాథోడ్. గత ఎన్నికల ముందు కూడా చెప్పులు లేకుండా పాదయాత్ర చేసి మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ సీఎం అయ్యేదాకా నో చెప్పులు
అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె కాళ్లకు చెప్పుల్లేకుండానే నడుస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా చెప్పులు లేకుండా కనిపించిన సత్యవతి రాథోడ్ ను మీడియా ఇదే విషయం పైన ప్రశ్నించగా కెసిఆర్ సీఎం అయ్యేదాకా చెప్పులు వేసుకోనని ఎన్నికలకు ముందే ప్రతిజ్ఞ చేశానని ఆ మాటకు కట్టుబడే చెప్పులు లేకుండా తిరుగుతున్నానని స్పష్టం చేశారు.
కేసీఆర్ వల్లే ఎదిగిన సత్యవతి రాథోడ్
రాజకీయాలలో కేసీఆర్ కారణంగానే ఎదిగానని చెప్పుకునే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల్లో ఓడిపోయిన తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని చెబుతారు. కేసీఆర్ క్యాబినెట్ లో పెద్దపీట వేసిన ఆయన చేసిన మేలు ఎప్పుడు మరిచిపోనని ఎప్పటికీ తను కేసీఆర్ కు కృతజ్ఞురాలిగానే ఉంటానని చెబుతారు. గతంలోనే కెసిఆర్ పేరు కూడా పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు సత్యవతి రాథోడ్.
కేసీఆర్ పట్ల సత్యవతి రాథోడ్ నిబద్దత
రాజకీయాలలో కేసీఆర్ ను వదిలి వెళ్ళేది లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మళ్లీ కేసిఆర్ తప్పనిసరిగా సీఎం అవుతారని అప్పుడే మళ్ళీ చెప్పులు వేసుకుంటానని సత్యవతి రాథోడ్ తేల్చి చెప్పారు. కెసిఆర్ ద్వారా లబ్ధి పొందిన ఎంతోమంది, అది మరిచిపోయి కేసిఆర్ కు షాక్ ఇచ్చి పక్క పార్టీలలో చేరితే నిబద్ధత ఉన్న నాయకురాలుగా సత్యవతి రాథోడ్, కెసిఆర్ కోసం చెప్పులు లేకుండా నడుస్తానని ఆయన మళ్లీ సీఎం అవుతారని చెప్పడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తానికి సత్యవతి రాథోడ్ కమిట్మెంట్ పార్టీతోనేనని ఆమె తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications