ముందు 90మంది అభ్యర్థులను వెతుక్కోండి.. తర్వాత మిషన్ 90: మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యం!!
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ మిషన్ 90 తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 90 నియోజకవర్గాలపై గట్టిగా ఫోకస్ పెట్టి, 90 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే బిజెపికి తెలంగాణలో అధికారం హస్తగతం అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బిజెపి మిషన్ 90 చేపట్టి ముందుకు వెళ్లనుంది. అయితే బీజేపీ మిషన్ 90 పై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ముందు ఆ పని చెయ్యాలి : నిరంజన్ రెడ్డి
బిజెపి మిషన్ 90 అంటుందని, ముందు బిజెపి నాయకులు 90 మంది అభ్యర్థులు వెతుక్కోవాలని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపికి క్షేత్రస్థాయిలో బలం లేదన్నారు. ఆ పార్టీకి అభ్యర్థులే కరువు అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మీ ఆటలు సాగవు అని పేర్కొన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కెసిఆర్ కట్టినట్టు భారతదేశంలో బిజెపి వాళ్ళు ఏదైనా పెద్ద ప్రాజెక్టులు కట్టారా అంటూ ప్రశ్నించారు.

మీ ఆటలు ఇక్కడ సాగవు
వ్యవసాయం లో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడ కూలి పనుల కోసం వస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని, ఇక్కడ పథకాలను చూసి బీజేపీ పెద్దలకు కళ్ళు మండుతున్నాయి అని, అందుకే తెలంగాణా రాష్ట్రాన్ని వారు టార్గెట్ చేస్తున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మీ ఆటలు తెలంగాణాలో సాగవని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేలా చూడాలి
దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన బీజేపీ పై నిప్పులు చెరిగారు. దుబ్బాక, సిద్దిపేట రెండు నియోజకవర్గాల భారాన్ని మంత్రి హరీష్ రావు మోస్తున్నాడని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటలో ఒకప్పుడు చుక్కనీరు లేదని, ఇప్పుడు సిద్దిపేట చుట్టూ నీరే ఉందని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక సీటు పొరపాటున మీరంతా చేజార్చుకున్నారు అని పేర్కొన్న ఆయన ఇంకొక ఏడాదిలో జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేలా చూడాలని సూచించారు.

తెలంగాణాలో బీజేపీ ఏం చెయ్యాలనుకున్నా సాధ్యం కాదన్న మంత్రి
ఇక ఇదే సమయంలో బిజెపి మిషన్ 90 పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, ముందు బిజెపి అభ్యర్థులను చూసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలనుకున్నా అది అంత సాధ్యమయ్యే విషయం కాదని స్పష్టం చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications