న్యాయసలహా తర్వాతే బ్రిజేష్ ట్రిబ్యునల్ పై ముందుకు
హైదరాబాద్ :బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పై ఎపి, తెలంగాణ రాష్ట్రాలు ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నాయి. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మద్య పున: పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై రెండు రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.న్యాయ నిపుణుల సలహా తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎపి కూడ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణ జలాలనే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.ఈ తీర్పు పై తమ అభ్యంతరాలను, వాదనలను విన్పించేందుకు రెండు రాష్ట్రాలకు 4 వారాల సమయాన్ని ఇచ్చింది.కృష్ణ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఎపి రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కలిపి పంచాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు తమకు నష్టం కల్గించాయని తెలంగాణ వాదిస్తోంది.
కృష్ణా జలాల కేటాయింపు సందర్భంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఎపి రాష్ట్రానికి 75 ఏళ్ళ నీటి లభ్యత ఆధారం చేసుకొంది. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం కేవలం 45 ఏళ్ళ నీటి లభ్యత ఆధారంగానే ఉమ్మడి ఎపి రాష్ట్రానికి నీటిని కేటాయించింది.ఈ రెండు ట్రిబ్యునల్ ల కేటాయింపులు నష్టం కల్గించాయని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ రెండవ తేదిన ఏర్పాటైంది.కృష్ణా జలాల్లో ఉమ్మడి ఎపిలో తెలంగాణకు న్యాయం జరగలేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కృష్ణా జలాల పున:పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు పుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది తెలంగాణ.దీనికితోడు బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడ ఆశ్రయించింది.ఈ ట్రిబ్యునల్ మాత్రం రెండు రాష్ట్రాలకు నిరాశ కల్గించేలా తీర్పును ఇచ్చింది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా తెలంగాణకు ఏ రకమైన నస్టాలు జరుగుతాయి....ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై అధ్యయనం చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హారీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఈ సబ్ కమిటీ అన్ని కోణాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తోంది.ఈ కేసుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తోన్న వైద్యనాధన్ తో మరోసారి సమావేశం కావాలని హారీష్ రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.ఈ నెల 29న, వైద్యనాథన్ తో కలిసి ఉపసంఘం సమావేశం కానుంది.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఎపి కూడ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.నాలుగు రాష్ట్రాల మద్య కృష్ణా జలాల పంపిణీ జరగాలని ఎఫి కూడ అభిప్రాయపడుతోంది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఎపి భావిస్తోంది.ఉమ్మడి ఎపి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు కృష్ణా జలాల వ్యవహారంపై సక్రమంగా రాష్ట్ర వాదనలను విన్పించని కారణంగానే ఇబ్బందులు తలెత్తాయని ఎపి అభిప్రాయపడుతోంది. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఎపి సన్నద్దమౌతోంది.అయితే తెలంాణతో కలిసి సుప్రీంకు వెళ్తారా....రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఈ విషయమై కోర్టు మెట్లెక్కకున్నారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications