కేసీఆర్.. మళ్లీ మొదటికి?
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ఇంకాస్సేపట్లో సభ ముందుకు రాబోతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించనున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. శాసన మండలిలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,91,059 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సారి ఈ సంఖ్య మూడు లక్షల కోట్లు దాటిందని తెలుస్తోంది. 3.20 లక్షల కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్ రూపొందినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గం కొద్దిసేపటి కిందటే ఈ ప్రతిపాదనలను ఆమోదించింది.

ఈ ఉదయం నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భట్టి విక్రమార్క.. బడ్జెట్ ప్రతిపాదనలతో అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
నీటి పారుదల ప్రాజెక్టులు, వ్యవసాయం, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. గృహావసరాలకు సరఫరా చేస్తోన్న ఉచిత విద్యుత్‌కూ అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. రేవంత్ సర్కార్.. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర రాబడిపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గైర్హాజర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీ రాలేదని చెబుతున్నారు. ఇంట్లో నుంచే బడ్జెట్ ప్రతిపాదనల ప్రసంగాన్ని వీక్షిస్తారని, దీనిపై విశ్లేషిస్తారని సమాచారం.
నిజానికి- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సైతం ఆయన గైర్హాజర్ అవుతారంటూ మొదట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. ఇప్పుడీ కీలక సమయంలో మళ్లీ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై సభలో జరిగే చర్చలకూ కేసీఆర్ రాకపోవచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications