ఏసీబీ కస్టడీలో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, దాడుల్లో కీలక పత్రాలు
ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అక్రమాల పైన ఏసీబీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతి పైన ఫోకస్ చేస్తున్న ఏసిబి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరీ రామ్, ఈఈ నూనె శ్రీధర్ లను అరెస్టు చేసింది.
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు
ఇప్పుడు తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ను అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగించారు.

మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్
ఏసీబీ అధికారులు సోదాల అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న వ్యవహారంలో ఏసీబీ అధికారులు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాలలో పది చోట్ల సోదాలు జరిపారు. మురళీధర్ రావుకి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమ ఆస్తులను ఏసిబి అధికారులు గుర్తించారు.
కాళేశ్వరం సబ్ కాంట్రాక్ట్ లలో భారీ అవినీతి.. కీలక పత్రాల స్వాధీనం
కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించి జరిపిన హోదాలలో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇక ఈ కేసులో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ను ఇటీవల కాళేశ్వరం కమిషన్ విచారణ జరిపింది.
విజిలెన్స్ నివేదికలోనూ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు పేరు
కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణలో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు కమిషన్ అడిగిన ప్రశ్నలకు తెలియదు మర్చిపోయాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక విజిలెన్స్ నివేదికలోనూ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు పేరును చేర్చారు . ఈ క్రమంలో మురళీధర్ రావు ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications