మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీ జనసేన నుండే..చర్చ అందుకే!!
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు త్వరలోనే రాజకీయంగా కొత్త అడుగు వేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తన వాట్సాప్ స్టేటస్‌లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోటోతో కూడిన పోస్టును షేర్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రాజకీయాలపై మాజీ తెలంగాణా హెల్త్ డైరెక్టర్ ఆసక్తి
ఆయన జనసేన కండువా కప్పుకోవడం దాదాపు ఖాయమనే సంకేతాలు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయం నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆయన ముమ్మర ప్రయత్నాలు చేశారు.

గతంలో బీఆర్ఎస్ నుండి టికెట్ ఆశించిన గడల శ్రీనివాసరావు
తన స్వంత జీఎస్‌ఆర్ (GSR) చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో పట్టు సాధించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) పార్టీ నుండి ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన బదిలీ అయ్యారు, అనంతరం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు.
కొత్తగూడెం నుంచి పోటీ చేసే ప్లాన్
ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ జనసేన బలాన్ని పుంజుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పవన్ ఈ ప్రకటన చేసిన వెంటనే గడల శ్రీనివాసరావు ఈ విధమైన పోస్ట్ పెట్టడం వెనుక బలమైన వ్యూహం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొత్తగూడెం ప్రాంతంలో ఆంధ్రా మూలాలున్న ఓటర్లు, పవన్ కల్యాణ్ అభిమానులు, యువత ఎక్కువగా ఉండటం తనకు కలిసి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.
జనసేనలో చేరితే అక్కడ గట్టి అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు
ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేపథ్యం ఉన్న శ్రీనివాసరావు జనసేనలో చేరితే, కొత్తగూడెం నుంచి ఆ పార్టీ తరఫున గట్టి అభ్యర్థి రంగంలోకి దిగినట్లవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ అంశంపై గడల శ్రీనివాసరావు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణా రాజకీయాల్లో జనసేన ఉంటుందని, తాము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్న క్రమంలో మాజీ డీహెచ్ పోస్ట్ కొత్త రాజకీయ సమీకరణాలకు కారణం అయ్యింది.













Click it and Unblock the Notifications