మంత్రి కొండా సురేఖను అభినందించిన మాజీమంత్రి కేటీఆర్.. ఆసక్తికర పరిణామం!
తెలంగాణ మంత్రి కొండా సురేఖను మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. మంత్రి కొండా సురేఖ నిన్న వరంగల్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన కేటీఆర్ నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు అభినందనలు అని పేర్కొన్నారు.
వాళ్ళ పేర్లు కొండా సురేఖ చెప్పాలి
మన రాష్ట్రంలో కాంగ్రెస్ కమీషన్ సర్కార్ నడుస్తోందని, ఈ 30 శాతం కమిషన్ ప్రభుత్వంలో సహచర మంత్రుల ప్రకారమే భారీ కమిషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టడం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆ మంత్రులందరి పేర్లు చెప్పాలని కొండా సురేఖను తాను కోరుతున్నానని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

విచారణకు ఆదేశిస్తారా?
మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ విచారణకు ఆదేశించగలరా అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే కాక ప్రతిపక్ష పార్టీలలోనూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే కొనసాగుతుంది.
కమీషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకున్నారన్న కిషన్ రెడ్డి
ఇక ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకున్నారు అన్నారు. అయితే ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకుంటారో కొండా సురేఖనే చెప్పాలి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల కమిషన్ పైన రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రులు ఫైళ్ళపై సంతకం చెయ్యాలంటే డబ్బులు తీసుకుంటారన్న సురేఖ
కాగా మంత్రి కొండా సురేఖ నిన్న వరంగల్ లో మంత్రులు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై సంతకం చేయాలంటే డబ్బులు తీసుకుంటారని, తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈరోజు మరో మారు తాను చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు.
తన మాటలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం
తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల పైన వ్యాఖ్యలు చేశానని, అప్పటి మంత్రులు ఏ పనికైనా డబ్బులు తీసుకునే వారని అన్నానని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కావాలని తన మాటలను వక్రీకరిస్తున్నారని కొండా సురేఖ పేర్కొన్నారు. తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications