ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి పునాది - సీఎం రేవంత్
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి పునాది పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఎస్సీ లీడర్లతో సీఎం భేటీ అయ్యారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆయన కొనియాడారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశామని.. సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించామని వెల్లడించారు.

ఎస్సీ వర్గాలకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మానని రేవంత్ తెలిపారు. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించామని స్పష్టం చేశారు. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్-1లో ఉంచామన్నారు. రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి తనకు వచ్చేది కాదని తెలిపారు.
భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని.. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆనాడు వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే వారిని సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామని రేవంత్ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదని.. కానీ తమ ప్రభుత్వం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టామని వివరించారు.
వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించామని.. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీంని నియమించామన్నారు. ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే... భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయాలని.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అలానే మరోవైపు మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఆయనతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని రేవంత్ స్పష్టం చేశారు. తన కంటే మోడీ, కిషన్‌రెడ్డిని ఆయన ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications