విషాదం: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కృష్ణా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఈ దుర్ఘటన జరిగింది. చిన్నారుల మృతితో వారిళ్లల్లో తీరని విషాదం నెలకొంది.
చనిపోయిన వారిని అఫ్రీన్(17), సమీర్(8) నౌషిన్(7), రిహన్(15)గా గుర్తించారు. మృతులంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారు. వీరు కొన్నాళ్ల క్రితమే కర్నూలుకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి ఆనందంగా గడిపారు.

ఈ క్రమంలో సోమవారం కృష్ణా నదిని చూసేందుకు సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న నది వద్దకు 11మంది ఆటోలో వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత స్నానం చేయాలని భావించి.. లోపలికి వెళ్లారు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడే ఉన్న బురదలో ఇరుక్కుపోయారు. దీంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.
అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న పిల్లలు.. విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మృతి చెందడంత స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాబోయేవాడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
తనతో నిశ్చితార్థమైన యువకుడు మరో పెళ్లి చేసుకున్నాడనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 9న పద్మావతికి నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గం పాతకోటకు చెందిన వినోద్ కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో వీరి వివాహం మే 10 జరగాల్సి ఉంది. అయితే, వినోద్ మరో పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో మనస్తాపానికి గురైన పద్మావతి.. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications