gaddam srinivas yadav: హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్: ఇప్పటి వరకు 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి(BRS) తాజాగా, పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను హైదరాబాద్ నుంచి పార్లమెంట్ బరిలో దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు.
దీంతో లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను
ప్రకటించినట్లైంది. 17 స్థానాలకు గాను మూడు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలు, మిగిలిన 12 స్థానాల్లో సగం స్థానాలు అంటే ఆరింటిని బీసీలకు కేటాయించారు. చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇందులో ఇద్దరు మున్నూరు కాపు, ఇద్దరు యాదవ, ఒకరు ముదిరాజ్, ఒకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.

ఇక బీఆర్ఎస్ ప్రకటించిన 17 అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఉండగా ఏడుగురు కొత్త వాళ్లకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఈ 17 మంది అభ్యర్థుల్లో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ RS Praveen Kumar)లు ఉన్నారు.
సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులైన ఖమ్మం - ఎంపీ నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ - మాలోతు కవిత, మహబూబ్‌నగర్ ఎంపీ - మన్నె శ్రీనివాస్ రెడ్డిలకే కేసీఆర్ మరోసారి పట్టం కట్టారు. ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సికింద్రాబాద్ సీటు కేటాయించారు. మెదక్ ఎంపీ సీటును ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డికి కేటాయించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో నిలవగా, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆత్రం సక్కు నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ నుంచి పోటీలో నిలుస్తున్నారు.
మరోవైపు, చేవెళ్ల టికెట్‌ను మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించారు. నాగర్‌కర్నూల్ టికెట్‌ను బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చారు. జహీరాబాద్, వరంగల్, మల్కాజిగిరి, భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ టికెట్లను కొత్త వాళ్లకు కేటాయించారు. ఇందులో జహీరాబాద్-అనిల్ కుమార్, వరంగల్ - కడియం కావ్య, మల్కాజిగిరి- రాగిడి లక్ష్మారెడ్డి, భువనగిరి-క్యామ మల్లేశ్, నల్గొండ-కంచర్ల కృష్ణారెడ్డి, హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ల పేర్లు ఖరారు చేశారు. అయితే, ఈసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండకపోవడం గమనార్హం. అంతకుముందు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications