Gaddar: కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానన్న గద్దర్ కుమార్తె వెన్నెల..
యుద్ధనౌక గద్దర్ కూతురు వెన్నెల రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శనివారం వెన్నెల హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తాను కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి తనకు టికెట్ వచ్చినా.. రాకపోయినా ఆ పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా తన పేరు మీడియాలో వస్తుందని ఆమె చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని పలువురు కోరుతున్నట్లు పేర్కొన్నారు.
తనకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని ఆమె తెలిపారు. మాలో ప్రజల కోసం పోరాటం చేసే స్ఫూర్తి ఉందని పేర్కొన్నారు. తనకు కంటోన్మెంట్ సీటు ఇస్తే స్థానిక నాయకులను కలుపుకుని పోయి పని చేస్తానని చెప్పారు. మా నాన్న చివర్లో కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఓడిపోయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని వెన్నెల చెప్పారు.

గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారని వెన్నెల గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని ఆయన కోరుకునేవారని వివరంచారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని కాంగ్రెస్ అంటోందని.. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు.టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తన బిడ్డకి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తోందని.. టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేస్తానని గద్దర్ భార్య విమల తెలిపారు. తన బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.
కొద్ది రోజుల క్రితం గద్దర్ మరణించిన విషయం తెలసిందే. గద్దర్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. గద్దర్ చనిపోకముందు కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications