కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి ట్రావెల్ చేసిన గణపయ్య
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ కోలాహలం నెలకొంది. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేషుడి మంటపాలు వెలిశాయి. విఘ్ననాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తోన్నారు జనం. హైదరాబాద్ లో ప్రతి చోటా గణేషుడి మండపాలు ఏర్పాటయ్యాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో మండపాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి.
ఈ పండుగ వస్తోందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విలక్షణ ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. వీధివీధినా భారీ మండపాలు ఏర్పాటు చేసి, విఘ్న నివారకుడైన గణనాథుడిని ప్రతిష్టించడానికి భక్తులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ పండుగ వేళ భక్తుల కోరికలను నెరవేర్చేందుకు వినాయక విగ్రహాలను సురక్షితంగా రవాణా చేయడంలో రైల్వేలు కూడా కీలక భాగస్వామిగా అవతరించడం ఈ ఏడాది ప్రత్యేకత.

కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అనంతపురానికి వినాయక విగ్రహాలు రైలు మార్గం ద్వారా సురక్షితంగా ప్రయాణించాయి. ట్రైన్ నంబర్ 12785 కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌లో ఈ ముచ్చటైన గణేశుడి విగ్రహాలను తరలించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. పట్టాలపై ప్రయాణిస్తూ.. రైలు మార్గం ద్వారా గణేషుడు తన భక్తుల వద్దకు తరలివెళ్తున్న ఫొటోలు ఆకట్టుకుంటోన్నాయి.
రోడ్డు మార్గాల ద్వారా భారీ వినాయక విగ్రహాలను సుదూర ప్రాంతాలకు తరలించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. మార్గమధ్యంలో రోడ్లపై ఉండే గుంతలు, ఊగిసలాటల వల్ల మట్టితో చేసిన సున్నితమైన విగ్రహాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రైలు మార్గంలో ప్రయాణించడం ద్వారా ఎలాంటి కుదుపులు లేకుండా అత్యంత భద్రంగా విగ్రహాలు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. రోడ్డు మార్గంతో పోలిస్తే రైల్వే పార్శిల్ సేవలు ఎంతో చవకైనవి కూడా.
ముఖ్యంగా అనంతపురం వంటి సుదూర ప్రాంతాలకు భారీ సైజు విగ్రహాలను రవాణా చేయాలంటే లారీ ఖర్చులు భారం అవుతాయి. ఇలాంటి సమయంలో రైల్వే సేవలను ఉపయోగించుకోవడం ద్వారా భక్తులకు, విగ్రహ తయారీదారులకు రవాణా ఛార్జీల భారం చాలా వరకు తగ్గుతుంది. రైల్వే.. ఓ రవాణా వ్యవస్థ మాత్రమే కాదనీ, దేశ భిన్న సంస్కృతులను ఏకం చేసే అతిపెద్ద నెట్ వర్క్ అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. కాచిగూడ నుంచి అనంతపురం వరకు సాగిన ఈ ప్రయాణం ఈ పండుగ సీజన్ లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది.












Click it and Unblock the Notifications
