వినాయక నిమజ్జనం వేళ.. విజ్ఞప్తి చేసిన ఆమ్రపాలి: ఆ పని చెయ్యొద్దు
Ganesh Idol: హైదరాబాద్‌లో వినాయక చవితి పండగ కోలాహలం కొనసాగుతోంది. ప్రతి వీధిలో విఘ్న నాయకుడు కొలువుదీరాడు. జంటనగరాల్లో వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి ఎత్తయిన ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం వద్ద జాతర తరహా వాతావరణం ఏర్పడింది. వేలాదిమంది భక్తులు వినాయకుడిని దర్శించుకోవడానికి బారులు తీరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా ఉంటోంది. వినాయకుడిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్‌కు చేరుకుంటోన్నారు.

ఈ నెల 17వ తేదీన అనంత చతుర్థశిని పురస్కరించుకుని గణేషుడి విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. ప్రతి సంవత్సరం కన్నుల పండువగా ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది. గణేషుడి విగ్రహాలన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఇంకొక్క రోజే గడువు మిగిలివుంది. నగరవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జోనల్ కమిషనర్లు, నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం సిబ్బంది- నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పండగ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ముగిసేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. దీనికోసం ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆమ్రపాలి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. తమతమ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
Appeal to the Public‼️🚨
— Commissioner GHMC (@CommissionrGHMC) September 16, 2024
It may seem temporarily amusing to see colored paper flying on the roads during Vinayaka immersion, but it takes the #GHMC staff several days to collect the garbage and clean up those roads. Moreover, that waste gets stuck in drainage channels, leading… pic.twitter.com/TzYIKJbEjs
దీన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు వస్తుంటారు. వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌ను అధికారులు మూసివేయనున్నారు. ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లించనున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం, ఊరేగింపు సజావుగా సాగేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ పరిణామాల మధ్య జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం సమయంలో పవర్ మిషన్లతో గాల్లోకి, రోడ్లపైకి రంగుల కాగితాలు ఎగేర వేయవద్దని కోరారు. అది- అప్పటికప్పుడు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చని, ఆ రోడ్లన్నీ శుభ్రపరచడం, వాటిని సేకరించటానికి తమ సిబ్బందికి కొన్ని రోజులు పడుతుందని అన్నారు.
అలా ఎగురవేసిన రంగుల కాగితాలు.. డ్రైనేజీలో చిక్కుకుపోతాయని, వర్షపు నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుంటాయని గుర్తు చేశారు. ఫలితంగా రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండిపోతుందని, దీనివల్ల వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయని పేర్కొన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండిపోతుందని, వరదకు కారణమౌతుందని వివరించారు. ఇలాంటి రంగుల కాగితాలు, ప్లాస్టిక్ రిబ్బన్లు ఎగుర వేయవద్దని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications