ఇళ్ళు కట్టుకునేవారికి శుభవార్త చెప్పిన జీహెచ్ఎంసీ!
ఇళ్ళు కట్టుకోవాలి అనుకునేవారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. జిహెచ్ఎంసి లో విలీనమైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నిలిచిపోయిన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. బిల్ట్ నౌ సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేయడంతోపాటు, ఇళ్ల నిర్మాణ అనుమతులకు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొంది.
విలీన మున్సిపాలిటీలు, కార్పోరేషన్ లలో నిర్మాణాలకు అనుమతులు
అయితే ప్రస్తుతం జి ప్లస్ టు భవనాలకు మాత్రమే అనుమతులు లభిస్తాయని వెల్లడించింది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తులు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నామని జిహెచ్ఎంసి పేర్కొంది. 75చదరపు గజాలలోపు భూములకు ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కింద స్టిల్ట్ ప్లస్ టు లేదా జి ప్లస్ వన్ అనుమతి ఇస్తున్నట్టుగా తెలిపింది. 75నుండి వంద చదరపుగజాల లోపు ఇన్స్టంట్ అప్రూవల్ ద్వారా స్టిల్ట్ ప్లస్ ఫైవ్ నిర్మాణాలను అనుమతిస్తున్నట్టు వెల్లడించింది.

సాఫ్ట్ వేర్ లో మార్పులు, త్వరలోనే అన్నీ సెట్
అయితే అంతకుమించి ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు ప్రస్తుతం సాఫ్ట్వేర్లో మార్పులు ఇంకా జరుగుతున్నాయని కాబట్టి వాటి అనుమతులకు మరికొన్ని రోజులు పట్టవచ్చు అన్న అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిహెచ్ఎంసిలో విలీనమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు సర్కిళ్ళలో జిహెచ్ఎంసి నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్ వేర్ ను సవరించిన తర్వాత దరఖాస్తులను పునరుద్ధరిస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం నిలిచిపోయిన పౌర సేవలు
బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు ఖాళీ స్థలం వంటి నిబంధనలలో కూడా మార్పులు చేర్పులు చేయనున్నారు. అయితే విలీనం తర్వాత విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో డబ్బులు చెల్లింపు లతో సహా అన్ని రకాల పౌర సేవలు నిలిచిపోయాయి. వాటన్నింటినీ సోమవారం నుండి తిరిగి పునరుద్ధరించి ప్రజల అసౌకర్యాన్ని తొలగిస్తామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన విభాగం వెల్లడించింది.
బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై త్వరలోనే నిర్ణయం
విలీనమైన మున్సిపాలిటీల పరిధిలోని భవన నిర్మాణ, జనన మరణ ధ్రువపత్రాలు, ఆస్తి పన్నులు, రియల్ ఎస్టేట్స్, ఇతర అన్ని రుసుములు ఇకపై జిహెచ్ఎంసి కమిషనర్ ఖాతాకు చేరుతాయి. హెచ్ఎండిఏ పరిధిలో ప్రస్తుతం చాలా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల అనుమతి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి నిబంధనల మధ్య చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పరిశీలిస్తున్న దరఖాస్తుల విషయంలో ఏ నియమాల ప్రకారం ఆమోదించాలో అధికారులు ప్రభుత్వం నుండి స్పష్టత కోరుతున్నారు. ఇక ఈ విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం రానుంది.












Click it and Unblock the Notifications