ఆగమన్నందుకు ఆత్మహత్య: కడుపులో ఇనుము
వరంగల్/ మహబూబ్‌నగర్ : కూర వండే వరకు ఆగలేవా అంటూ కన్నతల్లి మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ఒడితలలో ఆదివారం జరిగింది. గ్రామంలోని కడారి సరిత తన భర్త రమేష్ 15 ఏళ్ల క్రితం చనిపోగా ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. పెద్దకూతురు రమ్య (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
రమ్య పొద్దున్నే పచ్చడి వేసుకొని అన్నం తింటుండగా తల్లి సరిత చూసి ఇంత పొద్దున్నే ఎందుకు తింటున్నావు, కూర వండేవరకు ఆగలేవా.. అని అనడంతో పల్లెం అక్కడే వేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. అదే మనస్తాపంతో ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగింది. అరగంట తరువాత ఇంటికి వచ్చిన తల్లితో తాను మందు తాగానని తెలుపడంతో ఒడితల పీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా మారడంతో రమ్యను మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందినట్లు తెలిపారు.

ఇదిలా వుంటే, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఒక రోగి కుడుపులోంచి పలురకాల వస్తువులు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం, రాగంపేటకు చెందిన సారోజు రమే ష్ (42) హమాలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సుమారు పదేళ్ల క్రితం మానసిక వ్యథకు గురై ఇంట్లో ఉంటున్నాడు. ఇతడి భార్య భాగ్య కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
రమేష్‌కు కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసి అతని కడుపులోంచి పెన్నులు, పెన్సిళ్లు, కట్టెపుల్లలు, సైకిల్ పుల్లలు, నట్టు బోలోట్లు, ప్లాస్టిక్, తదితర సుమారు 40 వస్తువులను బయటికి తీశారు. ప్రస్తుతం అతని ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.
మహిళ సజీవదహనం
మహబూబ్‌నగర్ పట్టణంలోని బ్రాహ్మన్‌వాడకు చెందిన విజయలక్ష్మి(65) ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సజీవ దహనమైంది. విజయలక్ష్మి సోదరి లక్ష్మీదేవితో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం సోదరి బయటకు వెళ్లింది. కొద్ది రోజుల కిందట నల్లా గుంతలో పడి విజయలక్ష్మి కాలుకు దెబ్బతగిలి వాచింది. దాంతో మంచంపై కూర్చుని పొట్టు పొయ్యి వెలిగించి కాలును కాపుకుంటుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.
కాలు గాయంతో బాధపడుతున్న విజయలక్ష్మి వెంటనే లేవలేకపోయింది. గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే దట్టమైన పొగలు వ్యాపించడంతో వెళ్లలేక పోయారు. అగ్నిమాపక వాహనం సాయంతో మంటలను ఆర్పారు. అప్పటికే విజయలక్ష్మి దహనమైంది.












Click it and Unblock the Notifications