ఆ కారు, చేయిని నమ్మొద్దు: కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కారు బేకారు అయిపోయింది.. చేయి ప్రజలకు చెయ్యించ్చిందని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని విమర్శించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరన్నారు. యువతకు ఉద్యోగాలివ్వనందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన గర్జన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని.. ఇక్కడి ప్రజలను చూస్తుంటే రాజకీయ చైతన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. రాణీ రుద్రమ, కొమురంభీం లాంటి ఎందరో మహానుభావులు పుట్టినగడ్డ తెలంగాణ అని కొనియాడారు.

1984లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి.. రెండోది తెలంగాణ నుంచి గెలిచామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ గుర్తు చేశారు. గత 27 ఏళ్లుగా గుజరాత్ ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. కేవలం గుజరాత్ మాత్రమే కాకుండా దేశమంతా అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణలో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదన్నారు.
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుడి ఉందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. 2014లో ప్రజల పోరాటానికి తలొగ్గి.. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత.. ఎలా అభివృద్ధి చెందుతున్నాయో ప్రజలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఒక లిమిటెడ్ కంపెనీలా.. ఒక కుటుంబం అభివృద్ధికి మాత్రమే దోహదపడుతుందని దుయ్యబట్టారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని మండిపడ్డారు రాజ్‌నాథ్. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. అయోధ్యలో రామమందిరం కడతామని చెప్పి కట్టామన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పి చేశామని గుర్తు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్. దేశ వ్యాప్తంగా భూ రికార్డులు డిజిటలైజ్ చేసి.. పారదర్శకంగా సమాచారం అందించడమే కాకుండా రుణ సౌకర్యం పొందే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు రాజ్ నాథ్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications