శాకంబరిగా భద్రకాళి అమ్మవారి దర్శనం; పోటెత్తిన భక్తజనం!!
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఏ అమ్మవారి ఆలయంలోనూ లేనివిధంగా భద్రకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం నాలుగు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ నాలుగు ఉత్సవాలలో ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే శాకంబరీ ఉత్సవం అత్యంత విశిష్టమైనది.
నేడు ఆషాఢ శుద్ధపౌర్ణమి అయిన గురుపౌర్ణమి పర్వదినాన అమ్మవారి శాకంబరీ ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. రక రకాల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ పండ్లతో అమ్మవారిని అలంకరించి శాకములు ధరించిన తల్లిగా భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.

పదిహేను రోజులపాటు ఉదయం, సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఈ క్రమంలోనే నేడు ఓరుగల్లులో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించారు. శాకాంబరీ ఉత్సవాలలో భాగంగా చేసిన కూరగాయల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భద్రకాళి అమ్మవారి శాకంబరీ అలంకారం కోసం సుమారు ఐదు టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించారు. హైదరాబాద్ మొహిజాం మార్కెట్, గుడిమల్కాపూర్ నుంచి పండ్లు, సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుంచి కూరగాయలు తెప్పించారు.

వరంగల్ లోని లక్ష్మీపురం, బాలసముద్రం మార్కెట్ నుంచి కూరగాయలు సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలికి చెందిన చావలి హనుమా కుమార్ బృందం, ఆలయ అర్చకులు కలిసి అమ్మవారికి శాకంబరీ అలంకరణ చేశారు. 1968 నుండి 7 సంవత్సరాల పాటు ప్రజలు కరువు కాటకాలతో, అనావృష్టి తో బాధపడుతున్న సమయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శాకంబరి వేడుకలు మొదలు పెట్టారు.
కరువుకాటకాల నుంచి ప్రజలు బయటపడాలని, వర్షాలతో జీవించాలని భద్రకాళి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త బి ఎస్ గణేష్ శాస్త్రి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున శాకంబరీ ఉత్సవం నిర్వహించారు. ఆ తరువాత వర్షాలు కురిసి అందరూ సుఖ సంతోషాలతో జీవించారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భద్రకాళీ అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications