యాదాద్రి భక్తులకు శుభవార్త... ఇకనుంచి కొండపైకి ఆటోల అనుమతి...
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా యాదాద్రిలో వెలసిన నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం తరలివస్తుంటారు. యాదాద్రి కొండపైకి ప్రస్తుతం అన్ని వాహనాలకు అనుమతి లేదు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు మాత్రమే కొండపైకి చేరుకుంటున్నారు. సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు పార్కింగ్ ఫీజులు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో యాదాద్రి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇకనుంచి యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించింది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి 11 నుంచి కొండపైకి మొదటి ఘాట్ రోడ్ మీదుగా ఆటోలను అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రకటించడం జరిగింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాత ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలని నిర్ణయించారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తాయని ఆయన వివరించారు. అందులో మొదటి షిఫ్టు ఉదయం 3 గంటల నుంచి 1 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతీ షిఫ్టులో 50 ఆటోలు నడపాలన్నారు. ఇందులో 25 ఆటోలు కొండపైన ఉంటే, మరో 25 ఆటోలు కొండ కింద ఉంటాయన్నారు.

పది రోజుల్లో డార్మెటరీ హాలు నిర్మాణ పనులు ప్రారంభం : ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లకు కొన్ని దిశానిర్దేశాలు కూడా చేశారు. ప్రతీ ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులను మాత్రమే అనుమతించాల్సిందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ వంటి అన్ని రకాల ధ్రువపత్రాలు ఖచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు. ఇక, ఆటో డ్రైవర్లపై నిరంతరం నిఘా ఉంటుందని ఆయన వివరించారు. ఆటో ఛార్జీలు ఎంత నిర్ణయించాలనే విషయాన్ని ఆటో డ్రైవర్లతో చర్చించి చెబుతామని ఆయన తెలిపారు. యాదాద్రి కొండపైన భక్తులు మొక్కు నిద్రలు చేసేందుకు పది రోజుల్లో డార్మెటరీ హాలు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బీర్ల అయిలయ్య అన్నారు.












Click it and Unblock the Notifications