తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యంగా వైద్య, విద్యా రంగానికి పెద్దపీట వేస్తోంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో వైద్య సేవలు పెరిగాయని అసెంబ్లీ సాక్షిగా మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. దీనికి సంబంధించిన లెక్కలు కూడా ఆయన సభా వేదికగా చెప్పారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాల వైద్యసేవలకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ ద్వారా 9.45 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా 9.45 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గతానికి ఇప్పటికి చాలా తేడా అని చెప్పిన ఆయన, గతంలో ఏటా సగటున 2.5 లక్షల మందికి సేవలు అందేవని, ఇప్పుడు ఏటా 4 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు.

ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రీన్‌ఛానల్ ద్వారా ఆరోగ్య శ్రీ చెల్లింపులు
శాసనసభలో ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రశ్నలకు జవాబిచ్చిన మంత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రస్తుతం సుమారు రూ.250 కోట్ల మేర మాత్రమే బకాయిలున్నట్లు స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ అమలుపైన మాత్రమే కాదు ఆరోగ్యశ్రీ సేవలు పరిధిని కూడా పెంచినట్టు తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు క్రమం తప్పకుండా గ్రీన్‌ఛానల్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నాం అని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంలో వేగం
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించే దిశగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంలో వేగం పెంచి త్వరితగతిన అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో చేరేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటికి 330 ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు వాటిసంఖ్య 537కు చేరిందని పేర్కొన్నారు.
మారుమూల జిల్లాలలోనూ ఆరోగ్య శ్రీ అందేలా సేవలు
ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోని ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులకు మేలు జరిగేలా వాటిని అన్నివిధాలా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ వంటి వాటికి సంబంధించిన శస్త్రచికిత్సలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకంలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
పక్కా లెక్కలతో ప్రభుత్వం అందిస్తున్న సేవలను చెప్పిన మంత్రి
శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నిర్వహించేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలపై చర్చ సందర్భంగా, రాష్ట్రంలోని ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. బకాయిలను గ్రీన్‌ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అవి అందడం లేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోని మంత్రి దామోదర రాజనర్సింహ పక్కా లెక్కలతో ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు.












Click it and Unblock the Notifications