హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ విషయంలో శుభవార్త!
హైదరాబాద్ మెట్రో రైల్ విషయంలో నిన్నటిదాకా నెలకొన్న సందిగ్ధతకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను పూర్తిగా టేకోవర్ చేస్తుంది అన్న ప్రకటన చెక్ పెట్టింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని అధికారిక వర్గాలలో అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు బీజం
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కీలక నిర్ణయం తీసుకోవడంతో రెండవ దశ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. మొత్తం ఎల్ అండ్ టి సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడం కోసం జరిగిన ఒప్పందం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు బీజం వేసింది.

కేంద్రం ముందు తెలంగాణా ప్రతిపాదన.. కేంద్రం సూచన
మెట్రో రైలు ప్రాజెక్టు రెండవ దశకు సంబంధించి రెండు భాగాలుగా 2 ఏ, 2 బి కి సంబంధించి ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మెట్రో మొదటి దశ ఎల్ అండ్ టి అధీనంలో, రెండవ దశ ప్రభుత్వ అధీనంలో నిర్వహించడానికి ఉన్న ఇబ్బందులను తెలిపి రెండు జాయింట్ వెంచర్ గా దీనిని టేకోవర్ చేస్తే అనుమతి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
ఎల్ అండ్ టీ తో తెలంగాణా సర్కార్ డీల్
అయితే దీనిపైన ఎల్ అండ్ టి సంస్థతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వ ప్రపోజల్ కు ఎల్ అండ్ టి అంగీకరించలేదు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తానంటే ఇచ్చేస్తామని చెప్పడంతో 15వేల కోట్ల టేక్ ఓవర్ డీల్ తో ప్రభుత్వం దీనిని తమ అధీనంలోకి తీసుకునేందుకు అంగీకరించింది.
కేంద్రం అనుమతిస్తే మెట్రో రెండో దశ పనులు షురూ
దీంతో ప్రస్తుతం ఎల్ అండ్ టి తో కుదిరిన అవగాహన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి కేంద్ర ప్రభుత్వం నుండి మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టుకు డీపీఆర్ లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపితే సుమారు 19 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మాణం చేయాలని తలపెట్టిన హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టు మొదలవుతుంది.
మెట్రో విస్తరణకు తొలగిన అడ్డంకి
మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు ప్రస్తుతానికి ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆశాభావంతో ఉంది.హైదరాబాద్ మెట్రో రెండో దశ కూడా నిర్మిస్తే హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చాలా వరకు చెక్ పెట్టినట్టు అవుతుంది.












Click it and Unblock the Notifications