త్వరలోనే రేషన్ షాపుల్లో సన్నబియ్యం.. ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల కాలం పూర్తయింది. మరి కొద్ది రోజుల్లో ఏడాది పూర్తి చేసుకొని ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేదలకు ఒక శుభవార్త చెప్పింది.
నిరుపేదలకు పండుగ లాంటి వార్త
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు దగ్గర కావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రైతుల ద్వారా సన్న బియ్యం పండించడానికి ప్లాన్ అమలు చేస్తున్న ప్రభుత్వం సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్నబియ్యాన్ని ఎక్కువగా సాగు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే సన్నబియాన్ని జోరుగా కొనుగోలు సాగిస్తోంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు అందించడానికి రెడీ అవుతోంది.

రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఎప్పటి నుండి అంటే
వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనవరి 14 2025 నుంచి నిరుపేదలు సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని చాలామంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకు తింటున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ.
ఎన్నికల హామీ నెరవేర్చే పనిలో కాంగ్రెస్ సర్కార్
ఇక దొడ్డు బియ్యం తీసుకువెళ్లినప్పటికీ వాటిని తిరిగి షాపుల్లో ఇచ్చేసి సన్నబియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు పేదలు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని ఇస్తామని పేర్కొంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం జనవరి నుంచి సన్నబియ్యాన్ని నిరుపేదలకు రేషన్ షాప్ ల ద్వారా అందించనున్నారు.
నిరుపేదలకే కాదు, రైతులకు లబ్ది
ఇక ఈ విధానం ద్వారా ఇటు నిరుపేదలకు మాత్రమే కాకుండా రైతులకు కూడా పెద్ద ఎత్తున లబ్ది జరుగుతుంది. రైతులు దొడ్డు రకాలకు బదులు సన్న రకం బియ్యాన్ని పండించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు అందరికీ మేలు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి సన్న బియ్యం సంక్రాంతి నుంచి ఇస్తారు అని ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఇది నిరుపేదలకు నిజంగానే శుభవార్త అని చెప్పాలి.












Click it and Unblock the Notifications