వరంగల్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నగదు బహుమానం!!
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడానికి తెలంగాణ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా మత్తుపదార్థాల నియంత్రణకై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయితో పాటు, ఇతర మాదక ద్రవ్యాలను కట్టడి చేయడానికి డ్రగ్స్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.
డ్రగ్స్ కట్టడికి వరంగల్ సీపీ చర్యలు
యువతను గంజాయితోపాటు, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ఉక్కు పాదం మోపేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కమిషనర్ ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్, ముగ్గురు ఆర్ఎస్ఐలు, మరికొంతమంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

గంజాయితో పాటు డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టీమ్
ఈ టీం వరంగల్ ట్రైసిటీస్ తో పాటు గ్రామీణ ప్రాంతాలలో యువత మత్తు పదార్థాలను తీసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలతో పాటు, కళాశాలలు, స్కూల్స్ , గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలలు, ప్రధాన ప్రాంతాలను గుర్తిస్తారు. ఇక రాత్రివేళ గంజాయి విక్రయించే ప్రాంతాలలో ప్రధానంగా ఫోకస్ పెడతారు. గంజాయి సేవించే ప్రాంతాలపై స్థానిక పోలీసులతో కలిపి మెరుపుదాడులు చేస్తారు. గంజాయితో పాటు డ్రగ్స్ విక్రయించే వారిని పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారు.
ఈ నంబర్ కు కాల్ చెయ్యండి
యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం ను ఏర్పాటు చేయడంతో పాటు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయిని కట్టడి చేయడానికి, మత్తు పదార్థాల నివారణకు సంచలన నిర్ణయం తీసుకున్న కమిషనర్ ఎక్కడైనా మత్తు పదార్థాలను సేవిస్తున్న విక్రయిస్తున్న తమకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి తదితర డ్రగ్స్ అక్రమ రవాణా పైన 8712584473 నంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
వారికి నగదు బహుమతి
అధిక మొత్తంలో గంజాయి సమాచారం అందించిన వారికి భారీగా నగదు బహుమతి అందజేయబడుతుందని ఆయన వెల్లడించారు. గంజాయి రహిత పోలీస్ కమిషనరేటే మనందరి ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications