అమెరికాతో తెలంగాణకు గుడ్ రిలేషన్, 500లకుపైగా కంపెనీలు: హైదరాబాద్ నుంచి భారీగా వీసాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 500కుపైగా అమెరికా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 500కుపైగా అమెరికా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాకు చెందిన స్టేట్ సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో రాణిస్తోందన్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు తమ రెండో అతిపెద్ద కేంద్రాలు హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేసుకుంటున్నాయని తెలిపారు.

తెలంగాణలో అమెజాన్ 36వేల కోట్లు పెట్టుబడి
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో.. దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కేటీఆర్.. అమెజాన్ అదనపు పెట్టుబడి, విస్తరణ ప్రణాళికపై సంతోషం వ్యక్తం చేశారు. జనవరి నెలలో వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో అదనపు పెట్టుబడి పెట్టి విస్తరించేందుకు అమెజాన్ తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2030 నాటికి రూ. 36,300 కోట్ల పెట్టుబడిగా పెడతామన్న అమెజాన్ నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు.

డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్
అమెజాన్ పెట్టుబడులతో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి, అమెజాన్ మధ్య మంచి సంబంధాలున్నాయని, ఆ సంస్థ విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తమ వినియోగదారులకు ఉత్తమ క్లౌడ్ సేవలను అందించేందుకు చందన్‌పల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీలో మూడు డేటా సెంటర్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

అమెరికాకు హైదరాబాద్ నుంచే భారీగా వీసాలు
యాపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కేంద్రాలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్ సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో రాణిస్తోందని వెల్లడించారు. 2018లో ప్రారంభమైన స్టేట్ స్ట్రీట్ సంస్థలో ప్రస్తుతం 9వేల మంది ఉద్యోగులున్నారని చెప్పారు. అంతేగాక, హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నుంచి భారీగా విద్యార్థి వీసాలు జారీ అవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, ఏపీల నుంచి తెలుగువారు యూఎస్‌లో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.

అమెరికన్ ఇండియా ఫౌండేషన్‌కు కేటీఆర్ సూచన
మరోవైపు, దేశంలోనే తెలంగాణ.. వైద్య సేవల్లో అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. విద్య, వైద్యం, జీవనోపాధికి సంబంధించి ప్రజల అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్(ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. విద్య, ప్రజారోగ్యం, జీవనోపాధి అనే మూడు ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఫౌండేషన్ సభ్యులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications