మామిడి రైతులకు శుభవార్త.. అత్యాధునిక ఇరేడియేషన్ కేంద్రంతో మీ సమస్యకు చెక్!
తెలంగాణ మామిడి రైతులకు శుభవార్త. మామిడి సాగు చేసే రైతులకు ఎదురైన ప్రధాన సమస్యల్లో ఒకటైన టెంక పురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్ర ఉద్యానశాఖ మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేటలో అత్యాధునిక ఇరేడియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 24 కోట్లు ఖర్చు చేయనున్నారు.
మామిడి సాగులో టెంకె పురుగు సమస్య
ఈ కేంద్రం పని ప్రారంభమైతే మామిడి పండ్ల ఎగుమతులు మరింత సులభమవుతాయి మరియు రైతుల ఆదాయం పెరుగుతుంది. మామిడి సాగు రైతులు ప్రతి సీజన్‌లో ఎదుర్కొంటున్న టెంక పురుగు సమస్య వల్ల పండ్ల నాణ్యత దెబ్బతిని, ఎగుమతి మార్కెట్లలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో సగటున సంవత్సరానికి 3 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. అయితే దాదాపు 20 శాతం పండ్లు ఈ పురుగు బారిన పడుతున్నాయి .

అత్యాధునిక సాంకేతికతతో మామిడి రక్షణకు చర్యలు
దీంతో రైతులు ఆశించిన ధరలు రాకపోగా, పండ్లు కుళ్లిపోయి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఈ సమస్య జపాన్ వంటి దేశాలకు ఎగుమతులను కూడా ప్రభావితం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. శామీర్‌పేటలో నిర్మించనున్న ఇరేడియేషన్ కేంద్రంలో మామిడి పండ్లను ప్రత్యేక క్వారంటైన్ విధానంలో ప్రాసెస్ చేస్తారు. శక్తివంతమైన గామా కిరణాలు పండ్ల లోపలి పురుగులు, గుడ్లను పూర్తిగా నాశనం చేస్తాయి.
ఇరేడియేషన్ ద్వారా టెంక పురుగుకు చెక్
ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే - పండ్ల రుచి, నాణ్యత, పోషకాలు ఏమాత్రం ప్రభావితం కావు. ఈ ప్రక్రియ వల్ల పండ్ల నిల్వ కాలం కూడా గణనీయంగా పెరుగుతుంది.
ఫ్రూట్ ఫ్లై (టెంక పురుగు) పిందె దశలోనే పండు లోపలికి ప్రవేశిస్తుంది. పండు పక్వమవుతున్న కొద్దీ పురుగు పెరిగి టెంకను దెబ్బతీస్తుంది. ఇరేడియేషన్ ద్వారా ఈ సూక్ష్మజీవులను పూర్తిగా అంతం చేయవచ్చు.
కేంద్రం నుండి నిధులు, రంగారెడ్డి జిల్లాలోనూ ఇరేడియేషన్ కేంద్రం ప్లాన్
ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఇది అందుబాటులోకి వస్తే రైతులు ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ ప్రాజెక్టు గత పదేళ్లుగా చర్చలో ఉన్నప్పటికీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం 'మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టీకల్చర్' కింద నిధులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కోహెడలో కూడా మరో ఇరేడియేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications