ఐటీ ఉద్యోగులకు ఇరుకు అద్దెగదుల్లో ఉండాల్సిన పనిలేదు... ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించనున్న రేవంత్ సర్కార్!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. ప్రైవేట్ హాస్టళ్లపై ఆధారపడకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సురక్షితమైన హాస్టళ్లు నిర్మించి నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులకు పెద్ద షాక్ తప్పదు. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, రాయదుర్గం, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి వంటి ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో హాస్టళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ప్రైవేట్ హాస్టళ్లలోనే ఉంటున్నారు. ఈ అవకాశాన్ని చూసి కొందరు నిబంధనలు పట్టించుకోకుండా తక్కువ స్థలాల్లో ఆరు, ఏడు అంతస్తుల భవనాలు కట్టి హాస్టళ్లు నడుపుతున్నారు. ఇరుకైన గదులు, నాణ్యత లేని నిర్మాణం, సరైన అగ్నిమాపక వ్యవస్థ, అత్యవసర స్థితిలో బయటకు వెళ్ళే మార్గాలు లేకపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి.

కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. దీంతో హైడ్రా వంటి సంస్థలు సురక్షితం కాని భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లు, పీజీలపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్వయంగా హాస్టళ్లు నిర్మించి నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్‌లో అనువైన ప్రాంతాలు, భూముల లభ్యత, నిర్మాణ అవకాశాలు, నిర్వహణ విధానం వంటి అంశాలపై అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్నారు.
త్వరలో పూర్తి వివరాలతో నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు. సీఎం సూచనలు అందిన తర్వాత ప్రభుత్వ హాస్టళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తారు. ఇరుకు గదుల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న ఐటీ ఉద్యోగుల దృష్టిలో ఇది శుభవార్త. ప్రభుత్వ హాస్టళ్లు వస్తే సురక్షితమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలు, సరసమైన అద్దెతో వసతి లభిస్తుంది.
అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, నాణ్యత లేని భవనాల్లో నడుపుతున్న ప్రైవేట్ హాస్టళ్లకు షాక్ తగలనుంది . ఐటీ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వసతి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ చర్య ముందుకు సాగుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.













Click it and Unblock the Notifications
