చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ప్రారంభం.. ఖైదీల జీవితంలో కొత్త అధ్యాయం!
తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల పునరావాసం, నైపుణ్యాభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు వేసింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలు ప్రాంగణంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను ప్రారంభించారు. జైళ్ల శాఖ పరిధిలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేయడం ఇది తొలిసారి. దీని ద్వారా ఖైదీలు జైలు లోపలే గుర్తింపు పొందిన సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించి, విడుదల తర్వాత సమాజంలో సులభంగా స్థిరపడే అవకాశం కలుగుతుంది.
జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ ఐటీఐని ప్రారంభించారు. జైళ్లను కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ చర్యను చేపట్టినట్లు అధికారులు వివరించారు. భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ కింద తొమ్మిది ట్రేడ్‌లకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

ఒక్కో బ్యాచ్‌లో 200 మంది అభ్యర్థులకు శిక్షణ అందించేలా ప్రతిపాదించారు. ఆమోదం పొందిన కోర్సుల్లో ఫిట్టర్, పెయింటర్, వీవింగ్ టెక్నీషియన్, వుడ్ వర్క్ టెక్నీషియన్, వెల్డర్, డ్రెస్ మేకింగ్, హౌస్ కీపర్, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ ఉన్నాయి. ఇప్పటికే సుమారు 200 మంది ఖైదీలు ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివిధ కోర్సులకు తొమ్మిది మంది నైపుణ్యం కలిగిన శిక్షకులు అందుబాటులో ఉన్నారు.
ఖైదీల విద్యాభివృద్ధికి జైళ్ల శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీతో ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత 70 మంది ఖైదీలు పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరారు. విద్యార్హతలు పూర్తి చేసినవారిని ఐటీఐ కోర్సులు అభ్యసించేలా ప్రోత్సహిస్తామని డీజీ సౌమ్య మిశ్రా చెప్పారు.
విద్యతోపాటు వృత్తి నైపుణ్య శిక్షణను అనుసంధానం చేయడం ద్వారా ఖైదీలకు విడుదల అనంతరం ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు.శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన మాట్లాడుతూ, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గుర్తింపు పొందిన ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన ఖైదీలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఖైదీలు ఈ సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఆచరణాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని, విడుదల తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు.












Click it and Unblock the Notifications
