హైదరాబాద్‌లో కొత్త గ్రీన్ ఎస్‌ఎం క్యాబ్ సర్వీస్.. కిలోమీటర్‌కు కేవలం రూ.9 మాత్రమే!
హైదరాబాద్ నగర రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'విన్‌ఫాస్ట్' మాతృసంస్థ అయిన విన్‌గ్రూప్‌నకు చెందిన 'గ్రీన్ ఎస్‌ఎం' (Green SM) ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులు అధికారికంగా హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. నగరంలోని వివిధ డిపోల నుండి వేలాది ఎలక్ట్రిక్ కార్లతో సేవలను ప్రారంభించిన ఈ సంస్థ, ప్రయాణికులకు కిలోమీటర్‌కు కేవలం రూ. 8 నుంచి రూ. 9ల ప్రారంభ ధరకే ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది.
నగరంలో ఇప్పటికే పాతుకుపోయిన ఓలా , ఊబర్ , రాపిడో వంటి అగ్రిగేటర్ దిగ్గజాలకు ఇది గట్టి పోటీగా మారుతోంది. సాధారణ క్యాబ్ సర్వీసులకు భిన్నంగా గ్రీన్ ఎస్‌ఎం పూర్తిగా విభిన్నమైన బిజినెస్ మోడల్‌తో ముందుకు వస్తోంది. థర్డ్-పార్టీ డ్రైవర్లపై ఆధారపడకుండా, కంపెనీయే స్వయంగా సొంత వాహనాలను సమకూర్చుకోవడంతో పాటు డ్రైవర్లను నేరుగా ఉద్యోగులుగా నియమించుకుంటోంది.

వీరికి ప్రతి నెలా సుమారు రూ. 30,000 వరకు స్థిరమైన జీతంతో పాటు ఇన్సెంటివ్‌లు అందిస్తున్నారు. అంతేకాకుండా పీక్ అవర్స్‌లో లేదా రద్దీ సమయాల్లో ప్రయాణికులపై అదనపు భారం మోపే 'సర్జ్ ప్రైసింగ్' విధానానికి ఈ సర్వీస్‌లో తావులేకపోవడం ప్రయాణికులకు సంతోషాన్ని ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కావడం వల్ల శబ్దం, కాలుష్యం లేకపోవడంతో పాటు ప్రయాణికులకు ఉచిత తాగునీరు, వైపర్‌వైప్స్, అత్యవసర SOS బటన్లు, ఇంటీరియర్-ఎక్స్‌టీరియర్ కెమెరాల వంటి అధునాతన భద్రతా ఏర్పాట్లు కల్పించడం విశేషం.
అయితే, ఈ విదేశీ కంపెనీ ఎంట్రీ స్థానిక క్యాబ్, ఆటో డ్రైవర్లు మరియు రవాణా సంఘాలలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే నూతన సాంకేతికత, ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణాలు, బైక్ క్యాబ్స్‌తో సతమతమవుతున్న స్థానిక డ్రైవర్లకు, ఈ తక్కువ ధరల పోటీ మరింత భారంగా మారుతోందని ప్రతిపక్షాలు మరియు డ్రైవర్ సంఘాలు మండిపడుతున్నాయి.
ముందుగా తక్కువ ధరలతో ఆకర్షించి, ఆ తర్వాత మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకునే జియో తరహా వ్యూహాన్నే ఈ సంస్థ అనుసరిస్తోందని, ఇది స్వయం ఉపాధి పొందుతున్న లక్షలాది మంది డ్రైవర్ల పొట్టకొట్టడమే అవుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం గతంలో విన్‌గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలోనే ఇవి నగరంలోకి వచ్చాయని తెలుస్తోంది.
ప్రయాణికులకు మాత్రం తక్కువ ఖర్చుతో అత్యుత్తమ, కాలుష్య రహిత ప్రయాణ అనుభూతి లభిస్తున్నప్పటికీ, స్థానిక ఉపాధి రంగానికి తలెత్తుతున్న ఈ సవాళ్లను ప్రభుత్వం ఏ విధంగా సమతుల్యం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ క్యాబ్స్ ఎంట్రీతో ఏం జరగబోతోంది అన్నది ముందు ముందు తెలుస్తుంది.













Click it and Unblock the Notifications
