మింట్ కాంపౌండ్‌లో తుపాకీ మిస్‌ఫైర్ : హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య(49) మృతి చెందారు. తుపాకీ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అవ్వడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట అని తెలిపారు. రామయ్య మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా రామయ్య విధులు నిర్వహిస్తున్నారు. రోజులానే గురువారం కూడా తను ఉపయోగించే గన్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో బులెట్ రామయ్య శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం అవ్వగా.. గమనించిన తోటి సిబ్బంది, అధికారులు రామయ్యను నాంపల్లి లోని కేర్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఖైరతాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications