రేవంత్‌ను కల్సిన గుంటూరు ఎమ్మెల్యే, 'రాష్ట్రపతి చెప్పాకనైనా కెసిఆర్ మారాలి'
మహబూబ్ నగర్/హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పలువురు నేతలు, నాయకులు, అభిమానులు పరామర్శిస్తున్నారు. ఆదివారం నాడు గుంటూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మెదక్ జిల్లా టీడీపీ మహిళా నేత శశికళలు పరామర్శించారు.
రాష్ట్రపతి సూచనలతో మారాలి: రమణ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచనలతో అయినా కెసిఆర్ మారాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎల్ రమణ అన్నారు. రాష్ట్రపతి పెద్ద మనసుతో రెండు రాష్ట్రాలు పరస్పరం అభివృద్ధికి సహకరించుకోవాలని చెప్పారని, ఈ సూచనతోనైనా కెసిఆర్ పాలనలో మార్పు రావాలన్నారు.

కెసిఆర్ ఏడాది పాలన అంతా ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కక్షలు, కార్పణ్యాలతోనే సాగిందని మండిపడ్డారు. ఇంతకాలం రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించారనేందుకు రాష్ట్రపతి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.
తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే మొదట పాలకుల్లో మార్పు రావాలన్నారు. కేంద్ర పథకాలను సైతం ఈ రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయడం లేదని, ఉపాధి హామీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టంచుకోవడం లేదన్నారు. తెలుగువారి పార్టీ ఏదో, బీహారీల పార్టీ ఏదో టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications