రీల్స్ చేసేవారికి లక్ష దాకా గెలిచే బంపర్ ఛాన్స్ ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం; హర్రీఅప్!!
రీల్స్ చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై రీల్స్ చేస్తే ఏకంగా లక్ష రూపాయల వరకు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ పేరుతో హైదరాబాద్ అభివృద్ధిపై ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ :హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ కు సంబంధించి తెలంగాణా ఐటీ శాఖ డిజిటల్ మీడియా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ కాంటెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను షేర్ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత తొమ్మిదేళ్ల కాలంలో అత్యంత ప్రగతిశీలమైన రాష్ట్రాలలో ఒకటిగా అవతరించేందుకు తెలంగాణ విజయవంతమైన ప్రయాణాన్ని చేసిందని, అతి తక్కువ సమయంలో భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గుర్తించబడిందని పేర్కొంది.
కాంటెస్ట్ ఉద్దేశం ఇదే :తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం గ్లోబల్ ఐటి మరియు ఇన్నోవేషన్ హబ్ గా మారడానికి కావలసిన అద్భుతమైన పురోగతిని సాగించిందని ఈ క్రమంలోనే, ఈ విషయాలను అందరికీ చాటి చెప్పడానికి ఐటీ శాఖ డిజిటల్ మీడియా వింగ్ హ్యాపెనింగ్ హైదరాబాద్ షార్ట్ వీడియో కాంటెస్ట్ తో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. భారతదేశంలోని అతి పెద్ద మహానగరాలలో ఒకటైన హైదరాబాద్ కు సంబంధించి జరిగిన అభివృద్ధిని, సాధించిన ప్రగతిని షార్ట్ వీడియోల రూపంలో రీల్స్ ఫార్మేట్ లో సృష్టించాలని పేర్కొంది.

కాంటెస్ట్ రీల్స్ పంపేందుకు నిబంధనలు :హైదరాబాద్ పై రీల్ చేసిన కంటెంట్ జనవరి ఒకటి 2023 తర్వాత చేసినవై ఉండాలని, 60 సెకండ్ల నిడివిని మించకూడదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలని పేర్కొంది. 18 ఏళ్ల పైబడిన ఔత్సాహికులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చునని పేర్కొంది. రీల్స్ కు సంబంధించి ఏ అంశాల పైన రీల్స్ చేయాలో కూడా క్షుణ్ణంగా విశదీకరించింది. ఈ కాంటెస్ట్ కి సంబంధించి రీల్స్ పంపించదలచినవారు ఏప్రిల్ 31 తేదీలోపు పంపించాలని, విజేతలను మే రెండవ వారంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు.
లక్ష దాకా గెలుచుకునే బంపర్ ఛాన్స్ :ఈ పోటీలో అద్భుతంగా రీల్ చేసిన మొదటి విజేతకు 50వేల రూపాయలు, రెండో విజేతకు 25 వేల రూపాయలు, మూడో విజేతకు 10 వేలరూపాయలు, కన్సొలేషన్ ప్రైజ్ ల క్రింద 5వేల రూపాయలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనేవారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం https://it.telangana.gov.in/contest/ లాగిన్ అయితే ఈ కాంటెస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి.












Click it and Unblock the Notifications