హరీష్ నిందలు: తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారా?
వరంగల్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిందించారు. వ్యవసాయం దండగన్న తెలుగుదేశం పార్టీకి రైతులపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి శనివారం హాజరై ఆయన ప్రసంగించారు. ఢిల్లీ అపెక్స్ కమిటీలో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రైతులపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో చంద్రబాబు ఇచ్చిన దరఖాస్తును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలన్నారు.

ఢిల్లీలో ప్రాజెక్టులు ఆపాలంటారు, వరంగల్ గల్లీకి వచ్చి ప్రాజెక్టులు కట్టాలంటారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీలకు అజెండా లేదన్నారు. రైతులు సంతోషంగా ఉన్నా కూడా సమస్యలంటూ బయల్దేరారని, ఎప్పుడేం చేయాలో విపక్షాలకు తెలియదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత లేదని తెలిపారు. రబీలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎరువులను ఇప్పటికే నిల్వ ఉంచామని హరీష్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications