'సమ్మెకు హరీష్ మద్దతు, ఎండి బాబు ఏజెంట్'
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మద్దతు ఉందని టీఎంయూ నేత అశ్వత్ధామరెడ్డి అన్నారు. సీఎం వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన శనివారంనాడు విమర్శించారు.
సమ్మె కొనసాగితే సంస్థ మనుగడ దెబ్బతింటుందని ఆయన అన్నారు. హరీష్‌రావు ప్రభుత్వంలో మంత్రేకాక ఆర్టీసీ యూనియన్‌కు గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అందువల్ల హరీష్ రావు తమ సమస్యను పరిష్కరిస్తారన్న నమ్మకంతో ఆయన్ను కలుస్తామని అశ్వత్ధామరెడ్డి అన్నారు.
యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను ప్రలోభాలకు గురిచేస్తోందని, ఆర్టీసీ ఎండీ సాంబశివ రావు చంద్రబాబుకు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ఆర్టీసీ ఎండీ పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇదిలావుంటే, ఆర్టీసీ కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్రంగా ఖండించారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నకార్మికులపై లాఠీచార్జ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడం తగదని జానారెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.
ఎన్నికలకు ముందు హామీలను ప్రకటించి, అధికారంలోకి రాగానే వాటిని విస్మరిస్తే ఇలాంటి తిరుగుబాట్లు తప్పవని ఆయన అన్నారు.ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి ఆమోదయోగ్య పరిష్కారం చేయాలని జానారెడ్డి అభిప్రాయ పడ్డారు.












Click it and Unblock the Notifications