రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వ్యక్తి మృతి
ఉక్రెయిన్- రష్యా మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక దేశంపై మరో దేశం పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల్లో తెలంగాణ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో ఉన్నారు. ఇక ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.
జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఉక్రెయిన్ పై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు పలు ప్రాంతాలపై రష్యా బలగాలు మంగళవారం భీకర దాడులు నిర్వహించగా.. ఈ హింసాత్మక ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల్లో వావిలాల సుదర్శన్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
ఉక్రెయిన్ కు వెళ్లడానికి ముందు సుదర్శన్ తన స్వగ్రామమైన హస్నాబాద్ లోనే షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఉపాధి కోసం వెతుక్కుంటూ ఆయన నాలుగు నెలల క్రితమే ఉక్రెయిన్ కు పయనం అయ్యాడు. ఇక సెప్టెంబర్ 1, మంగళవారం రోజున రష్యా బలగాలు కీవ్ నగరంపై క్రూజ్ మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడిన సమయంలో సుదర్శన్ తాను ఉంటున్న గది నుంచి బయటకు వచ్చాడు.

అదే సమయంలో జరిగిన పేలుళ్ల ధాటికి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఉక్రెయిన్ లోనే ఉంటున్న సమీప తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ద్వారా సుదర్శన్ మరణించిన విషయం కుటుంబ సభ్యులకు చేరింది. దాంతో హుస్నాబాద్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications