హైదరాబాద్‌లో కుండపోత- ఎనిమిది జిల్లాలకు ఎల్లో వార్నింగ్
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఈ సాయంత్రం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం వరకూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఎల్లో వార్నింగ్‌ను జారీ చేసింది.
హైదరాబాద్‌లో ఈ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలు దట్టంగా అలముకున్నాయి. ఉన్నట్టుండి భారీ వర్షం పడింది. ఒక్కసారిగా భారీ వర్షం కురువడంతో పలు ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. గంటల తరబడి వాహానదారులు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల ధాటికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, బోరబండ, కూకట్‌పల్లి, లింగంపల్లి, నిజాంపేట్, కొండాపూర్, మణికొండ, రాయదుర్గం, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, అత్తాపూర్.. ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు అంధకారంలో గడిపారు.
భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదాలు సంభవించకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications