హైదరాబాద్ తోపాటు జిల్లాల్లో భారీ వర్షం: శ్రీశైలం హైవేపై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురియడంతో శ్రీశైలం జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు కూలాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు-కందుకూరు రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో వర్షం పడగా కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం పడగా కుట్టకింది తండాలో ఈదురుగాలుల ధాటికి ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.
కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేణ 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications