హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. మునిగిన విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి!
సెప్టెంబరు రెండో వారం వచ్చినప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు జిహెచ్ఎంసి పరిధిలో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో సుమారు రెండు గంటలుగా వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో అనేక కాలనీలు జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో అనేక ప్రాంతాలలో భారీ వర్షం
హైదరాబాద్లో చినుకు పడితేనే నగర రహదారులన్నీ చిత్తడిగా మారుతాయి. అటువంటిది కుండపోతగా వర్షం కురిస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్ తో పాటు అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

మునిగిపోయిన జాతీయ రహదారి
హైదరాబాద్లో, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్సార్ నగర్, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు జాతీయ రహదారి వరదనీటితో మునిగిపోయింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. దీంతో వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు.
విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన నిలిచిన ట్రాఫిక్
మరోవైపు భారీ వర్షంతో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారి పైన మోకాళ్ళ లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో హయత్ నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలు భారీ వరద నీటి కారణంగా నిలిచిపోయాయి. ఇక వాహనదారులకు ఇబ్బంది నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో నాలుగు రోజులు వర్షాలు
ఇదిలా ఉంటే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 14వ తేదీ వరకు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురు, శుక్రవారాలలో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న కూడా హైదరాబాద్లో అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications