భారీ వర్షాల హెచ్చరిక.. వారికి సీఎం కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 8వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా ప్రకటించింది.
తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు... సీఎం రేవంత్ కీలక అలెర్ట్
ఇక తాజాగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.

వచ్చే మూడు రోజులు వర్షాలే.. సీఎం ఏం చెప్పారంటే
సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. జిహెచ్ఎంసి తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఇక రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని అన్ని విభాగాలతో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని, అందరూ జిల్లాలలోనే అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్తు సహాయక బృందాలు అందుబాటులో ఉండి తక్షణమే స్పందించాలని ఆయన అన్నారు. ఇక సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తమకు నివేదికలు అందించాలని ఉన్నతాధికారులు కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
నేడు 13 జిల్లాలు, రేపు 12 జిల్లాలలో భారీ వర్షం
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో నిన్న భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో వర్షం కురుస్తుందని పేర్కొంది. రేపు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అని పేర్కొంది.












Click it and Unblock the Notifications