తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా, మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తెల్లవారుజామున పూరీ, చిలుకా లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో ఆ ప్రభావం ఎక్కువగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్లపైన చూపనున్నట్లు వెల్లడించింది. అంతేగాక, ఆ వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

హైదారాబాద్లో ఆకాశం మేఘావృతమై సాయంత్రం వరకు నిర్విరామంగా మోస్తరు వర్షం కురవనున్నట్లు పేర్కొంది. బుధవారం నుంచి 24 తేదీల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షాలంటూ ఐఎండీ హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల దృష్ట్యా జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలిస్తే వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. దాదాపు వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నివాసితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications