జల దిగ్బంధంలో వరంగల్; నీట మునిగిన 34 కాలనీలు; తాజా పరిస్థితి ఇదే!!
వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలతో వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి .ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్న వరంగల్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ నగరం అతలాకుతలంగా మారింది.
అనేక కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వరంగల్ నగరంలో 34 పైగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ లోని డీకే నగర్, ఎస్సార్ నగర్, అండర్ రైల్వే గేట్, హంటర్ రోడ్ లోని పలు కాలనీలు నీట మునిగాయి.

వరంగల్ హంటర్ రోడ్ లోని ఎన్. టి. ఆర్, కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్ లలో పూర్తిగా వరద నీరు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కలిసి ట్రాక్టర్ లో ప్రయాణించి ముంపు పరిస్థితులను పరిశీలించారు. కాలనీలలో వరద నీరు చేరుకోవడంతో ఈ కాలనీ ల్లో నివాసం వుంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మధురనగర్ కాలనీ, 19వ డివిజన్ లోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, శాంతినగర్ ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.కాగా గ్రేటర్ వరంగల్ పరిధిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సంతోషిమాత గార్డెన్లో ఆశ్రయం పొందుతున్న ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రజలను పరామర్శించిన మేయర్ వారికి భరోసాను కల్పించారు.

ముంపు ప్రాంతాల ప్రజలు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ పునరావాసం కల్పించి, మౌలిక వసతులు కల్పిస్తామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు.హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం ములుగు జాతీయ రహదారి163 కి అనుకోని ఉన్న కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి పడింది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
వరంగల్ జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపురం మండలంలోని పాకాల సరస్సుకు భారీగా వరద నీరు చేరుతుంది. బుధవారం పాఖాల సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టం 31 ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 23 ఫీట్లు చేరుకుంది. కురుస్తున్న వర్షాలకు నర్సంపేట డివిజన్ లోని మాధన్నపేట, రంగాయ చెరువుల్లోకి, హన్మకొండలోని భద్రకాళీ చెరువు, రామప్ప జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.












Click it and Unblock the Notifications