కేసీఆర్ సర్కారుకు హైకోర్టు షాక్: ‘జీవో123తో భూములు సేకరించొద్దు’
సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఫార్మా కంపెనీల కోసం తెలంగాణ సర్కారు భూములు సేకరిస్తున్న జీవో 123పై హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఫార్మా కంపెనీల కోసం తెలంగాణ సర్కారు భూములు సేకరిస్తున్న జీవో 123పై హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఈ జీవో ఆధారంగా భూములు సేకరించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గతంలో కూడా ఈ జీవోపై హైకోర్టును పలువురు ఆశ్రయించగా వీరికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను అశ్రయించగా.. అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఈ నేపథ్యంలో సుమారు వందమంది పిటిషనర్లు తమ తరపు న్యాయవాదుల సహాయంతో ఈ జీవోను వ్యతిరేకిస్తూ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. స్వచ్ఛందంగా భూముల సేకరణ జరిగేలా చూడాలని కోరారు. 123జీవో ద్వారా బలవంతంగా భూములను లాక్కుంటున్నారని, దీంతో తగిన పరిహారం కూడా లభించడం లేదని పిటిషనర్లు న్యాయవాదుల ద్వారా తమ వాదన వినిపించారు.
ఈ అంశంపై 15రోజులపాటు వాదనలు జరగడం గమనార్హం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే భూములు సేకరించవచ్చని హైకోర్టు తెలిపింది. కాగా, తాము బలవంతంగా ఎవరి నుంచి భూములు లాక్కోవట్లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత జీవో కంటే ఎక్కువ పరిహారమే చెల్లిస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications