బీసీ రిజర్వేషన్ల పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు, తాజా నిర్ణయం..!!
బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు కోరుతూ పలు పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అనుకూలంగానూ మరి కొందరు ఇంప్లీడ్ అయ్యారు. రెండు వైపులా హోరా హోరీగా వాదనలు జరిగాయి ఇదే సమయంలో న్యాయస్థానం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం సరైన విధానం పాటించలేదని పిటీషనర్లు వాదించారు. ప్రభుత్వం తరపు న్యాయ వాదులు రిజర్వేషన్ల పైన ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని చెప్పుకొచ్చారు. వాదనల తరువాత హైకోర్టు రేపటికి విచారణకు వాయిదా వేసింది.
బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సమయంలో పిటీషనర్ల తరపు న్యాయవాదులు పలు అంశాలను ప్రస్తావించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరగలేదని పిటీషన్ తరపు లాయర్ వాదించారు. ట్రిపుల్ టెస్ట్ గురించి ప్రధానంగా తన వాదనల్లో ప్రస్తావించారు. ఎన్నికలు వాయిదా వేయమని తాము కోరటం లేదని...చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరారు.

ఇదే సమయంలో హై కోర్టు సైతం రిజర్వేషన్లపై ప్రస్తుత ఏంటనిప్రశ్నించింది. సుప్రీం కోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయిందా అంటూ కోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయ వాదులు సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. జీవో పై స్టే ఇవ్వాలని కోరటం సరైనది కాదన్నారు. ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరిగిందని కోర్టుకు సింఘ్వీ వివరించారు. బీసీ రిజర్వేషన్ల ను అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని చెప్పుకొచ్చారు.
బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లి ఆరు నెలలు అయినా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు నివేదించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనేది సుప్రీం ఆదేశం మినహా.. రాజ్యాంగంలో ఎక్కడా లేదని సింఘ్వీ పేర్కొన్నారు. శాస్త్రీయ బద్దంగా సర్వే జరిగాకే రిజర్వేషన్లు ఖరారు చేసారని వివరించారు. తమ వాదనలు పూర్తిగా వినాలని.. కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పిన సింఘ్వీ ఆ తరువాతనే తీర్పు వెలువరించాలని కోరారు. తదుపరి విచారణ కోసం హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు కోర్టు నిర్ణయం తరువాత రిజర్వేషన్ల అమలు.. స్థానిక సంస్థల ఎన్నికల పైన స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications