బీజేపీ నేతలకు షా క్లాస్ - రోడ్ మ్యాప్ ఫిక్స్..!!
తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో జరిగిన మార్పులను ప్రస్తావించి ప్రస్తుత పరిస్థితుల పైన సీరియస్ అయ్యారు. ఎన్నికలవేళ ఇదే నా వ్యవహరించే తీరు అంటూ మండిపడ్డారు. పార్టీ నేతలకు రోడ్ మ్యాప్ డిసైడ్ చేశారు.
ఖమ్మం వేదికగా బీజేపీ నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ వైఖరి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఎటువంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సభ తర్వాత పార్టీ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులను ఆరా తీశారు. తన వద్దకు వచ్చిన నివేదికలను ప్రస్తావించారు. పార్టీలో సంస్థాగత మార్పులను ప్రస్తావించి తాజా పరిస్థితుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానంగా నేతల మధ్య కొరవడిన సమన్వయం పైన షా ప్రశ్నలు సంధించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమన్వయం లేకుండా గ్రూపులుగా వ్యవహరించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా బలంగా ఉన్న నేతలకు మద్దతు ఇవ్వాలని ఎన్నికల కోసం సమన్వయంతో పాటు వేగంగా వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ షా దిశా నిర్దేశం చేశారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదంటూ క్లాస్ తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
వేగం పెంచాలని వెంటనే ఎన్నికలు, మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ హై కమాండ్ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని షా హామీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేసే ఏ అవకాశాన్ని వదులుకోవద్దంటూ అమిత్ షా స్పష్టం చేశారు. పార్టీ నేతలు కాన్ఫిడెన్స్, క్లారిటీ, కోఆర్డినేషన్,కమిట్మెంట్, క్రెడిబిలిటీ ఇలా c5 ఫార్ములాతో ముందుకు వెళ్లాలంటూ అమిత్ షా మార్గ నిర్దేశం చేశారు. పార్టీలో నేతలు ఎవరు ఏం చేస్తున్నారో తమ వద్ద పూర్తి సమాచారం ఉందని అన్ని వ్యవహారాలను పార్టీ గమనిస్తోందని వెల్లడించారు. త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటనకు వస్తానని షా చెప్పినట్లు సమాచారం












Click it and Unblock the Notifications